: సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను 'ఎయిర్ లిఫ్ట్' చేయమన్న అక్షయ్ కుమార్... స్పందించిన సుష్మా స్వరాజ్!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేశాడు. అతని ట్వీట్ కు సుష్మా స్వరాజ్ కూడా వెంటనే స్పందించడం విశేషం. దక్షిణ సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను రక్షించే చర్యలు వేగవంతం చేయాలని, వారిని అక్కడి నుంచి తరలించాలని కోరుతూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. దీనికి వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్, 'అక్షయ్ కుమార్ గారు, ఆందోళన చెందకండి. జూబా నుంచి భారతీయులను సురక్షితంగా తరలిస్తున్నాం' అంటూ సమాధానమిచ్చారు. కాగా, దక్షిణ సూడాన్ లోని జూబా నగరంలో భద్రతా బలగాలు, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలకు మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడున్న విదేశీయులు స్వదేశాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జూబా నగరంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించాలని అక్షయ్ కోరాడు. ఇదిలా ఉంచితే, ఇటీవల వచ్చిన 'ఎయిర్ లిఫ్ట్' హిందీ సినిమాలో ఇరాక్ లో చిక్కుకున్న భారతీయులను తరలించే భారతీయ వ్యాపారవేత్తగా అక్షయ్ కుమార్ నటించిన సంగతి తెలిసిందే.