: హబ్ ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి అసాధ్యం: తమ్మినేని వీరభద్రం
పారిశ్రామిక విధానంలో తెలంగాణ ప్రభుత్వం చాలా అస్పష్టంగా ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గతంలో హబ్ లు, సెజ్ లు మాదిరిగా అదే పరిభాషను ఇప్పుడు మంత్రి కేటీఆర్ వాడుతున్నారని, ఈ-హబ్, టీ-హబ్ అంటూ.. హబ్ లను మాత్రం వదిలిపెట్టడం లేదని విమర్శించారు. ఈ హబ్ ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి అసాధ్యమని, మన వనరులను కొల్లగొట్టడానికి, తెలంగాణలో ఉన్న భౌతిక సంపదను కాజేయడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. ఎక్కడైతే వ్యవసాయ అనుబంధంగా వనరులు ఉన్నాయో, ముడిసరుకు దొరుకుతుందో వాటి ఆధారంగా పరిశ్రమలు స్థాపించాలని అన్నారు. 'ఎంతసేపటికీ హైదరాబాద్ ను విశ్వనగరం చేయాలంటారు.. విశ్వనగరం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం తప్పా, ఇక్కడున్న భూములను అమ్ముకుంటే గవర్నమెంట్ కు ఆదాయం వస్తుందనే ధ్యాస తప్పా వేరే ఆలోచన ప్రభుత్వానికి లేదు' అన్నారాయన. హైదరాబాద్ లో జనజీవితం ఛిద్రం కావడానికి, దరిద్రంగా తయారవడానికి కారణం ఈ నగరం సైజ్ ను పెంచడమేనన్నారు. నగరం సైజ్ ను ఇంకా పెంచడానికి విశ్వనగరం డిమాండ్లు పనికొస్తాయి తప్పా, ఉన్న ప్రజలు బతకడానికి ఈ డిమాండ్లు పనికిరావని తమ్మినేని అభిప్రాయపడ్డారు.