: ఢిల్లీ బీజేపీ నేత విజయేంద్ర గుప్తాను చంపుతామని బెదిరింపు కాల్స్
ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు విజయేంద్ర గుప్తా తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 9న తన పీఏ మొబైల్ ఫోన్‌కు కాల్ చేసిన దుండగులు తనను చంపుతానని బెదిరించినట్లు విజయేంద్ర గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ హస్తం ఉందని ఆయన పోలీసులకి తెలిపారు. గత ఏడాది కూడా తనకు ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని, అచ్చం అలాగే గత నెల 9న మరో బెదిరింపు కాల్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఈనెల 9న తన పీఏ ఫోన్ కు ఇలాంటి కాల్ మరోసారి రావడంపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈనెల 9 న విజయేంద్రను చంపుతామని కాల్ వచ్చిందని ఆయన పీఏ ఆశిశ్ కట్యాల్ కూడా తెలిపారు. అంతేకాక ఇప్పటికి ఆయనపై రెండు సార్లు దాడి కూడా జరిగిందని ఆయన చెప్పారు. అదృష్టవశాత్తు ఆయన ఆ దాడుల నుంచి బయటపడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై కేసు నమోదు చేసుకున్న ప్రశాంత్ విహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.