: ఈ బౌట్ తో నా కెరీర్ ఏమీ ముగిసిపోదు!: బాక్సర్ విజేందర్ సింగ్


ఇప్పుడు తాను ప్రొఫెషనల్ బాక్సర్ నని, గతంలో జరిగిన అన్ని బౌట్ లలానే ఈ నెల 16న ఢిల్లీలోని త్యాగరాయ స్టేడియంలో నిర్వహించనున్న బౌట్ ను కూడా పరిగణిస్తానని భారత బాక్సర్ విజేందర్ సింగ్ తెలిపాడు. డబ్ల్యూబీవో ఆసియా టైటిల్ అనేది తనకు బిగ్ డీల్ కాదని విజేందర్ పేర్కొన్నాడు. వరుసగా ఆరు బౌట్లు గెలిచిన తనకు ఇది మరొక బౌట్ మాత్రమేనని పేర్కొన్నాడు. ఈ బౌట్ కు కూడా అన్ని బౌట్ లలానే సిద్ధమవుతున్నానని అన్నాడు. ఈ బౌట్ తో తన కెరీర్ ఏమీ ముగిసిపోదని విజేందర్ తెలిపాడు. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ తో జరిగే బౌట్ హోరాహోరీగా జరిగినా తాను దీనిని మరో పోరాటంగా మాత్రమే చూస్తానని, అంతకంటే ప్రత్యేకంగా దీనిని చూడాలనుకోవడం లేదని విజేందర్ పేర్కొన్నాడు. ఇది తన ఉద్యోగమని పేర్కొన్న విజేందర్, రింగ్ లోకి ఎంటరయ్యాక విజయం గురించి మాత్రమే ఆలోచిస్తానని తెలిపాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన విజేందర్ ఇప్పటి వరకు ఓటమి అన్నదే లేకుండా సాగిపోతున్నాడు. స్వదేశీ అభిమానుల సమక్షంలో జరిగే పోరులో విజేందర్ కు అంతులేని మద్దతు లభిస్తుంది కానీ, అంతే స్థాయిలో ఒత్తిడి కూడా ఉంటుంది. ఇదే సమయంలో ప్రత్యర్థి కెర్రీ హోప్ కు ప్రొఫెషనల్ బాక్సింగ్ లో 12 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటి వరకు 30 బౌట్లలో తలపడిన హోప్, రెండు నాకౌట్ లతో పాటు 23 విజయాలు సాధించాడు. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేందర్ తన జోరు కొనసాగిస్తాడా? లేక హోప్ గెలుస్తాడా? అంటూ బాక్సింగ్ అభిమానుల మధ్య విదేశాల్లో భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ బౌట్ ను భారత్ తరపున వివిధ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే విజేందర్ స్నేహితులు, పలువురు సెలబ్రిటీలు ప్రత్యక్షంగా వీక్షించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News