: నేను భారతీయుడ్ని... వాడు చచ్చినా ఆ శవాన్ని కూడా చూడను: ఐసీస్ లో చేరిన కేరళీయుడి తండ్రి


కాలికట్ లో ఖురాన్ చదివేందుకు వెళ్తున్నామని చెప్పి, ఆ తరువాత శ్రీలంకలో ఉన్నత చదువులు చదువుతామంటూ కేరళ వీడిన కొంతమంది యువకులు ఇరాక్, సిరియాల్లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరినట్టుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో అలా కనిపించకుండా వెళ్లిన వారి ఇళ్లకు వెళ్లిన మీడియా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేశారు. ఈ సదర్భంగా హఫీసుద్దీన్ (22) అనే యువకుడి తండ్రిని కలిసినప్పుడు ఆయన తన కుమారుడి చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ తనను 'అబ్బాజాన్ అబ్బాజాన్' అని పిలిచే తన కుమారుడు, ఉన్నట్టుండి కఫీర్ (దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి, దేవుడిని వ్యతిరేకించే వ్యక్తి) అని పిలవడం ప్రారంభించాడని ఆయన అన్నారు. 'వాడు పూర్తిగా తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. వాడిని తీవ్రవాద భావజాలం పూర్తిగా మార్చేసింద'ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజు తనకు మెసేజ్ పెట్టిన తన కుమారుడు అందులో 'నాకు ఇప్పుడు స్వర్గం దొరికింద'ని పేర్కొన్నాడు. 'పన్నులు లేవు, షరియా చట్టం లేదు. ఇక్కడ నన్ను పట్టుకునేవారు లేరు. ఇది నిజంగా మంచి చోటు' అని పేర్కొన్నాడని ఆయన తెలిపారు. వాడు భారతదేశాన్ని ఇష్టపడకుంటే... వాడు ఈ దేశానికి హాని చేయదలిస్తే, కనీసం వాడి శవాన్ని కూడా చూడనని ఆయన కరాఖండీగా చెప్పారు. 'నేను భారతీయుడ్ని, వాడి శవాన్ని కూడా చూడాలనుకోవడం లేదు' అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

  • Loading...

More Telugu News