: మల్లన్న సాగర్ వివాదం... రంగంలోకి దిగి ఓ గ్రామాన్ని ఒప్పించిన హరీశ్ రావు!


మెదక్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారీ నీటి పారుదల ప్రాజెక్టు మల్లన్న సాగర్ కు ప్రధాన అడ్డంకిగా ఉన్న ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు ప్రాజెక్టుకు తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించారు. ప్రాజెక్టుకున్న అడ్డంకులను తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి హరీశ్ రావు, ఈ మధ్యాహ్నం గ్రామంలోని వారందరినీ పిలిపించి వారితో చర్చించారు. కొంత బేరసారాల అనంతరం ఎకరాకు రూ. 6 లక్షలు పరిహారం ఇచ్చి భూములను అప్పగించేందుకు రైతులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. దీంతో మల్లన్న సాగర్ కు ప్రధాన అడ్డంకి తొలగినట్లయింది. ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రసంగిస్తూ, ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో భాగంగా భూములను కోల్పోయే వారందరినీ తమ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గ్రామాన్ని మరో చోట ప్రభుత్వ నిధులతో నిర్మించి ఇదే పేరు పెడతామని ఆయన తెలిపారు. గ్రామాన్ని దత్తత తీసుకుని ఓ పట్టణం మాదిరిగా సకల సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని హరీశ్ రావు చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసించి భూములను ఇచ్చేందుకు అంగీకరించినట్టు ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు.

  • Loading...

More Telugu News