: హైదరాబాదులో మరో ఇద్దరు ఐఎస్ సానుభూతిపరులు... పట్టేసిన పోలీసులు
భాగ్యనగరి హైదరాబాదును ఉగ్ర భయాలు వదలడం లేదు. ఇప్పటికే నగరంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు హైదరాబాదులోనే మకాం వేసి పక్కాగా స్కెచ్ వేసిన ఐదుగురు ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను ఇటీవలే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పట్టేసిన సంగతి తెలిసింది. కోర్టు అనుమతితో దాదాపు 12 రోజుల పాటు సదరు ఉగ్రవాదులను అన్ని కోణాల్లో విచారించిన ఎన్ఐఏ... కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. కోర్టుకు ఐఎస్ ఉగ్రవాదుల అప్పగింత సమయంలోనే హైదరాబాదులో మరో ఇద్దరు ఐఎస్ సానుభూతిపరులు అరెస్టయ్యారు. ఐదుగురు ఉగ్రవాదులు విచారణలో భాగంగా వెల్లడించిన వివరాల ఆధారంగానే తాజా అరెస్ట్ లు జరిగినట్లు సమాచారం. తాజాగా అరెస్టైన ఇద్దరు ఐఎస్ సానుభూతిపరులను మొఘల్ పురా, బండ్లగూడకు చెందిన అహ్మదుల్లా, యాసిర్ గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్టైన ఐదుగురు ఉగ్రవాదులతో వీరికి సంబంధాలున్నాయని పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.