: బందరులో హైటెన్షన్!... పోర్టు విస్తరణపై అఖిలపక్షం నిరసన, ఆర్పీఎఫ్ జవాన్ల కవాతు!


కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మచిలీపట్నం సమీపంలోని బందరు పోర్టు విస్తరణకు చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పోర్టు విస్తరణకు అవసరమైన భూమి ఎంత? అన్న విషయంపై కేబినెట్ లోని మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేశారు. 5 వేల ఎకరాల మేరకే సేకరణ చేస్తామని ఓ మంత్రి ప్రకటించగా, లక్షకు పైగా ఎకరాల సేకరణ అవసరమంటూ మరో మంత్రి చెప్పారు. దీనిపై ప్రస్తుతం రాద్ధాంతం నడుస్తోంది. 2 నుంచి 3 వేల ఎకరాలతో పూర్తయ్యే పోర్టు విస్తరణకు లక్ష ఎకరాల భూముల సేకరణ ఎందుకంటూ విపక్షం వైసీపీ సహా వామపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అంతేకాక నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోర్టు వద్ద నిరసనకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మచిలీపట్నం హైవేపై ఉన్నట్టుండి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బలగాలు ప్రత్యక్షమయ్యాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆర్పీఎఫ్ జవాన్లు అక్కడ కవాతు చేశారు. శాంతియుతంగా నిర్వహించనున్న ఆందోళనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకే బలగాలను రంగంలోకి దించిందని విపక్షం ఆరోపిస్తుంటే... బందరు పోర్టు ఆందోళనకు, ఆర్పీఎఫ్ బలగాల మోహరింపునకు ఎలాంటి సంబంధం లేదని అధికార టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా... ఆర్పీఎఫ్ బలగాల పరేడ్ తో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News