: ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ,'కలబంద'ను సాగు చేసి కోట్లు గడిస్తున్న రాజస్థాన్ యువకుడు!


హరీశ్ ధన్ దేవ్... రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంత వాసి. స్వతహాగా ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన హరీశ్ కు చేతిలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, మనసులో ఏదో అసంతృప్తి. ఏదో చేయాలన్న తపన. తనకున్న భూమిని వినియోగంలోకి తేవాలన్న ఆలోచన. కానీ, ఎడారి ప్రాంతమైన జైసల్మేర్ లో పంటలు పండవు. ఈ సమయం ఢిల్లీలో జరిగిన ఓ వ్యవసాయ ప్రదర్శనను తిలకించేందుకు హరీశ్ వెళ్లాడు. ఆ రోజున అతని జీవితమే మలుపు తిరిగింది. వెంటనే మునిసిపల్ కార్పొరేషన్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, స్వగ్రామానికి వచ్చేసి, తనకున్న భూమిలో కలబంద (అలోవెరా) పెంపకం చేపట్టాడు. హరీశ్ ఇప్పుడు ఏడాదికి రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నాడు. తానే స్వయంగా 'నాచురల్ ఆగ్రో' పేరిట కంపెనీని మొదలు పెట్టాడు. థార్ ఎడారి ప్రాంతంలో హరీశ్ పండిస్తున్న అలోవెరాలో మంచి క్వాలిటీ ఉందని తెలుసుకున్న పతంజలి ఫుడ్ ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచే అలోవెరాను కొనుగోలు చేస్తోంది. ఒక్క పతంజలి మాత్రమే కాదు. బ్రెజిల్, హాంకాంగ్, అమెరికా తదితర దేశాలకూ కలబందను ఎగుమతి చేస్తున్నాడు హరీశ్. తొలి సంవత్సరం 80 వేల మొక్కలు నాటిన హరీశ్, ఇప్పుడు వాటి సంఖ్యను 7 లక్షలకు పెంచాడు. గడచిన నాలుగు నెలల్లో 125 టన్నులకు పైగా అలో వెరా జ్యూస్ ను హరీద్వార్ లోని పతంజలి ఫ్యాక్టరీలకు పంపినట్టు తెలిపాడు. కలబంద చెక్కు తీసి లోపలి గుజ్జును ప్రాసెస్ చేసేందుకు అత్యాధునిక ప్లాంటును స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు కూడా. ఓ మంచి ఆలోచన వచ్చి, దాన్ని ఆచరణలోకి తీసుకెళ్తే, ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చన్న దానికి హరీశ్ ఓ మంచి ఉదాహరణ.

  • Loading...

More Telugu News