: తెలంగాణలో కొత్తగా ‘విదేశీ వ్యవహారాల శాఖ’... త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్!


విదేశీ వ్యవహారాల శాఖ... ఇది కేంద్ర కేబినెట్ లోని కీలక శాఖ. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నీ కేంద్రం పరిధిలోనే వుంటాయి కాబట్టి, ఆ వ్యవహారాలతో పాటు ఎన్నారై వ్యవహారాలను కూడా ఈ శాఖ పర్యవేక్షిస్తుంది. ఇప్పటిదాకా దేశంలోని ఏ రాష్ట్ర కేబినెట్ లోనూ ఈ శాఖ లేదు. అయితే దేశంలో 29వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ఈ శాఖ ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం జరగనుందని జాతీయ మీడియా ఆసక్తికర కథనాలను ప్రచురించింది. వివరాల్లోకెళితే... విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ వాసుల సాధక బాధకాలతో పాటు వారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు ఓ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కార్యకలాపాలు సాగించనున్న ఈ శాఖ బాధ్యతలను కూడా కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించనున్నారట. ఇప్పటికే రూపొందిన ఎన్నారై పాలసీపై ఈ నెల 16న కేబినెట్ లో కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్నారై పాలసీకి ఆమోదం లభించగానే కేబినెట్ లో కొత్తగా ‘తెలంగాణ విదేశీ వ్యవహారాల శాఖ’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలు కీలక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కేటీఆర్... రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విదేశీ వ్యవహారాల శాఖను కూడా కేసీఆర్ ఆయనకు అప్పగిస్తారట.

  • Loading...

More Telugu News