: ఇక పగటిపూటా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు!... నిన్న ఒక్కరోజే 106 మంది పట్టుబడ్డ వైనం!
భాగ్యనగరి హైదరాబాదులో మద్యం తాగి బండ్లెక్కుతున్న యువతపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇప్పటిదాకా రాత్రి వేళల్లోనే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతుండగా, తాజాగా ఇక పగటి పూట కూడా ఈ తరహా తనిఖీలకు హైదరాబాదు ఖాకీలు శ్రీకారం చుట్టారు. నిన్న ఈస్ట్ జోన్ పరిధిలో కొనసాగిన డ్రంకన్ డ్రైవ్ పగటిపూట తనిఖీల్లో ఏకంగా 106 మంది మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఇకపై పగటి పూట కూడా రోజూ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పోలీసులు ప్రకటించారు.