: మా గురించి మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి!: పాకిస్థాన్‌కు భారత్ గట్టి హెచ్చరిక


భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదని పొరుగు దేశం పాకిస్థాన్‌ను భారత్ తీవ్రంగా హెచ్చరించింది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ మృతి ఘటనపై స్పందించిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్.. విషయం విని షాక్ కు గురైనట్టు పేర్కొన్న విషయం తెలిసిందే. వనీని ‘కశ్మీర్ నేత’గా పేర్కొన్న పాకిస్థాన్ ఈ విషయంలో తన ఆందోళనను వ్యక్తం చేసింది. కశ్మీర్ నేతలను, ప్రజలను ఆర్మీ చంపేస్తోందని పాక్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వనీ మృతికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ప్రజలపై భారత్ చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తూ మిలటరీని ఉపయోగించి కాల్పులకు పాల్పడుతోందని ఆరోపించింది. అంతేకాక కశ్మీర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నవాజ్ డిమాండ్ చేశారు. తద్వారా కశ్మీర్.. పాకిస్థాన్‌లో ఉండాలో, భారత్‌లో ఉండాలో ప్రజలే తేల్చుకుంటారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. పొరుగు దేశం గురించి కాకుండా, సొంత దేశం గురించి ఆలోచించుకుంటే మేలని హెచ్చరించింది. పాకిస్థాన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ ప్రతినిధి వికాశ్ స్వరూప్ పేర్కొన్నారు. పొరుగు దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం ఆ దేశానికే మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News