: వెనక్కి తగ్గిన వివాదాస్పద మతబోధకుడు.. మరో రెండు మూడు వారాలు విదేశాల్లోనే జకీర్ నాయక్
వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ఇండియా వచ్చేందుకు జంకుతున్నారు. భారత్‌లో అడుగుపెడితే అరెస్ట్ ఖాయమన్న వార్తల నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మరో రెండు మూడు వారాల వరకు ఆయన భారత్‌లో అడుగుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఆఫ్రికా దేశాల్లో పర్యటించిన ఆనంతరం ఇక్కడకు రావాలని ఆయన యోచిస్తున్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలపై మాట్లాడేందుకు ఇప్పటి వరకు భారత అధికారులు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. దర్యాప్తు అధికారులకు అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్న జకీర్ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సమర్థించనని పేర్కొన్నారు. తానే ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ‘నా బోధనలు విని వాటిని ఉగ్రవాదానికి అనుకూలంగా వాడుకోవడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా’’ అని పేర్కొన్నారు. సమయం అనుకూలిస్తే మరి కొన్ని రోజుల్లో తనపై వస్తున్న అన్ని ఆరోపణలకు సమాధానం చెబుతానని వివరించారు. బంగ్లాదేశ్ మారణహోమం తర్వాత ఒక్కసారిగా జకీర్ నాయక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగాల స్ఫూర్తితోనే తాను ఉగ్రవాదంలోకి వెళ్లినట్టు పట్టుబడిన ఉగ్రవాది ఒకరు చెప్పిన విషయం విదితమే.