: కోర్టుకు రాని లేడీ డాన్ సంగీత!... అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన కోర్టు!
ఎర్రచందనం అక్రమ రవాణాలో కాకలు తీరిన డాన్ గా పేరుపడ్డ సంగీతా చటర్జీ చిత్తూరు జిల్లా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆమెను అరెస్ట్ చేసేందుకు రెండు పర్యాయాలు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా వెళ్లిన చిత్తూరు పోలీసులకు స్థానిక కోర్టుల నుంచి బెయిల్ తీసుకున్న సంగీతా మస్కా కొట్టింది. అయితే కేసు విచారణకు హాజరుకావాలన్న చిత్తూరు కోర్టు నోటీసులను ఆమె ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఈ క్రమంలో నిన్నటి విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తామని కోర్టు హెచ్చరించినా ఆమె నుంచి స్పందన లేదు. నిన్నటి విచారణకు కూడా ఆమె గైర్హాజరైంది. దీంతో సంగీతా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లు పట్టుకుని నేడో, రేపో చిత్తూరు జిల్లా పోలీసులు మరోమారు కోల్ కతా వెళ్లనున్నారు.