: కల్లోలంగా మారిన కశ్మీర్.. రంగంలోకి మరో 800 మంది సీఆర్పీఎఫ్ బలగాలు
కశ్మీర్ ప్రాంతం ఇప్పుడు కల్లోలంగా మారింది. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీని ఎన్ కౌంటర్ చేయడంతో రెండు రోజులుగా ఆందోళనలు తారస్థాయికి చేరాయి. దీంతో కేంద్రం మరో 800 మంది సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. ఇప్పటికే రెండు రోజుల క్రితం కేంద్రం 1200 మంది సహాయక సిబ్బందిని కశ్మీర్‌కు పంపిన సంగతి తెలిసిందే. అల్లర్లు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో కేంద్రం బలగాలను మరింత పెంచాలని నిర్ణయం తీసుకొని 100 మంది సిబ్బంది చొప్పున ఎనిమిది బృందాలను అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పంపించింది. కశ్మీర్‌లో రెండు రోజులుగా చెలరేగుతోన్న ఆందోళనల్లో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. మరో 250 మందికి పైగా గాయాలపాలయ్యారు. కొందరు ఆందోళనకారులు ఈరోజు మరింత రెచ్చిపోయి సోపోర్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60 వేల మంది భద్రతాసిబ్బంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.