: పాకిస్థాన్‌లో ఉన్న వారిని కాదు.. మొదట భారత్‌లో నక్కిన వారిని పట్టుకోండి: శివసేన
తాను చేసే ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఆరోపణలు ఎదుర్కుంటోన్న ఇస్లామిక్ స్కాలర్, టెలీ మత బోధకుడు జకీర్ నాయక్ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుపై శివసేన మండిపడింది. కేంద్రం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్‌ను పట్టుకుంటాం అని చెప్పుకోవడం ఆపేసి ముందు జకీర్ నాయక్‌ను అరెస్టు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. పాకిస్థాన్ నుంచి దావూద్, మెమన్ లాంటి వారిని భారత్ రప్పిస్తాం అనే మాటలు కట్టిపెట్టి జకీర్ నాయక్‌పై ప్రభుత్వం దృష్టి సారించాలని శివసేన డిమాండ్ చేసింది. మొదట భారత్‌లోనే నక్కిన ఇటువంటి వారిని అదుపులోకి తీసుకోవాలని శివసేన సూచించింది. 26/11 దాడి కేసులో అరెస్టు చేసిన అజ్మల్ కసబ్ ని గతంలో ఏ జైలు గదిలో ఉంచారో, అదే గదిలో జకీర్ ను పడేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని శివసేన డిమాండ్ చేసింది. వేర్పాటు వాదులు రెచ్చిపోయేలా జకీర్ నాయక్ ప్రసంగాలు ఉన్నాయని శివసేన సామ్నా పత్రికలో పేర్కొంది. ముస్లిం యువతను హింసాత్మక ధోరణులకు పురిగొల్పే విధంగా జకీర్ ప్రసంగాలు ఉన్నాయని శివసేన ఆరోపించింది. భారత్‌లో ఆయన ప్రసంగాలు కొత్త రీతిలో అశాంతిని ప్రేరేపించేటట్లు ఉన్నాయని పేర్కొంది. కేంద్రం నల్లధనాన్ని తెప్పించే చర్యలు కొన్నాళ్లు ఆపేసి, జకీర్‌కి ఎవరు నిధులు అందిస్తున్నారో వారిపై దృష్టి పెట్టాలని శివసేన డిమాండ్ చేసింది. జకీర్ భారత్‌కు చేరుకోగానే పోలీసులు ఆయనను అరెస్టు చేయాలని శివసేన పేర్కొంది.