: రిజర్వేషన్ల అంశంపై వినతి పత్రాలు ప్రతిరోజు అందుతున్నాయి: బీసీ కమిషన్ ఛైర్మన్ మంజునాథ
కాపులకు రిజర్వేషన్ల కల్పనపై అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజునాథ కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో పర్యటించి మంజునాథ కమిషన్ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనుంది. ఈ విషయమై బీసీ కమిషన్ ఛైర్మన్ మంజునాథ ఈరోజు మీడియాతో మాట్లాడారు. కాపులు, ఇతర వెనకబడిన కులాలకు బీసీ రిజర్వేషన్లపై జిల్లాలవారీగా వచ్చేనెలనుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమకు పలు సంఘాల నుంచి వినతి పత్రాలు ప్రతిరోజు అందుతున్నాయని మంజునాథ చెప్పారు. ప్రతి వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకొని నిశితంగా పరిశీలిస్తామని, ఏ ఒక్కరికీ అన్యాయం చేయబోమని ఆయన పేర్కొన్నారు. ఆయా జిల్లాలు, గ్రామాల పర్యటన వివరాలను వచ్చేనెల ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రజాధికార సర్వేలో వెల్లడైన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.