: సింగిల్ గోల్ తో సాకర్ హీరోగా ఎడెన్!


సాకర్ గేమ్ లో సూపర్ హీరోగా పేరుగాంచిన రొనాల్డో లాంటి కీలక ఆటగాళ్లున్నా... యూరో కప్ ను గెలుచుకోవడంలో పోర్చుగల్ ఇప్పటిదాకా సఫలీకృతం కాలేదు. తాజాగా నిన్న రాత్రి ముగిసిన యూరో కప్ ఫైనల్ లో ఆ దేశం అనుకున్నది సాధించింది. అయితే ఆ దేశ జట్టుకు అందిన ఈ విజయం రొనాల్డో లాంటి స్టార్లు అందించిన విజయం ఎంతమాత్రం కాదు. బలమైన జట్టుగా పేరున్న ఫ్రాన్స్ లాంటి జట్టుతో సాగుతున్న టైటిల్ పోరులో రొనాల్డో గాయంతో ఆట మధ్యలోనే రిజర్వ్ బెంచ్ కు చేరాడు. ఈ క్రమంలో పోర్చుగల్ గెలవడం దాదాపుగా అసాధ్యమేనని ఆ దేశ అభిమానులు కళ్ల నీళ్ల పర్యంతమయ్యారు. రిజర్వ్ బెంచ్ కు చేరిన రొనాల్డో కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. అయితే ఆ తర్వాత పోర్చుగల్ జట్టుకు చెందిన మరో ఆటగాడు బయటకెళ్లగా ఆ స్థానంలో సబ్ స్టిట్యూట్ గా వచ్చిన ఎడెన్ ఫ్రాన్స్ కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ 79వ నిమిషంలోనే ఎడెన్ మైదానంలోకి వచ్చినా... 109వ నిమిషం దాకా అతడికీ గోల్ చేయడం కుదరలేదు. అయితే ఇక మ్యాచ్ టైగా ముగియడం ఖాయమనుకున్న తరుణంలో మెరుపులా కదిలిన ఎడెన్... 25 యార్డుల దూరం నుంచే తన పిక్క బలంతో బాల్ ను నేరుగా గోల్ పోస్ట్ లోకి పంపేశాడు. అంతే... ఒక్కసారిగా పోర్చుగల్ అభిమానులు కేరింతలు కొడితే... రొనాల్డో ఎగిరి గంతేశాడు. వెరసి సింగిల్ గోల్ తో ఎడెన్ సాకర్ స్టార్ గా మారిపోయాడు. ఎడెన్ కొట్టిన గోల్ కు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలు ప్రధాన న్యూస్ ఛానెళ్లు ప్రధానంగా ప్రసారం చేశాయి. ఇక అన్ని దేశాలకు చెందిన న్యూస్ పోర్టళ్లు కూడా సదరు వీడియోను ప్రధాన శీర్షికలుగా పెట్టాయి.

  • Loading...

More Telugu News