: రాజధాని సెకండ్ ఏసీ రైలు టికెట్ ధరకే చివరి నిమిషపు విమాన టికెట్
మరింత మంది విమాన ప్రయాణికులను ఆకర్షించడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకోవాలని భావిస్తున్న ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా వినూత్న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి పలు రూట్లలో లాస్ట్ మినిట్ విమాన టికెట్ ధరలను రాజధాని రైళ్లలో సెకండ్ ఏసీ ధరకే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సంస్థ సీఎండీ అశ్వని లోహానీ స్వయంగా వెల్లడించారు. విమానాలు బయలుదేరేందుకు నాలుగు గంటల ముందు వరకూ ఇవి అమలవుతాయని ఆయన తెలిపారు. ఢిల్లీ నుంచి ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా సర్వీసుల్లో ఈ టికెట్ ధరలను వర్తింపజేయనున్నట్టు లోహానీ తెలిపారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ - ముంబై మార్గంలో ఏసీ - టూ టైర్ టికెట్ ధర రూ. 2,870 ఉండగా, ఢిల్లీ - చెన్నై రూట్ లో రూ. 3,905, ఢిల్లీ - కోల్ కతా మధ్య రూ. 2,890, ఢిల్లీ - బెంగళూరు మధ్య రూ. 4,095గా ఉంది. ఎయిర్ ఇండియా విమానాల్లో ఆక్యుపెన్సీ సరాసరిన 74 శాతంగా ఉండగా, ఈ రూట్లలో సెకండ్ ఏసీ టికెట్ కు ఫ్లయిట్ టికెట్ లభిస్తే, ఆక్యుపెన్సీ 80 శాతాన్ని దాటిపోతుందని అంచనా. చివరి నిమిషంలో ప్రయాణించాలని భావించే వారిని టికెట్ ధరలు 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉండటం అడ్డుకుంటోందని, ఇకపై ఈ ఇబ్బంది ఉండదని, దశలవారీగా మిగతా రూట్లలోనూ ఇదే విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉందని లోహానీ వివరించారు.