: కాశ్మీర్ లో 21కి చేరిన మృతుల సంఖ్య... శాంతికి సహకరించాలని వేర్పాటు వాదులకు ముఫ్తీ సర్కారు వినతి
హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ అనంతరం కాశ్మీరు లోయలో కొనసాగుతున్న అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 21కి పెరిగింది. లోయలో శాంతికి సహకరించాలని ముఫ్తీ మహమ్మద్ ప్రభుత్వం వేర్పాటు వాదులను కోరింది. అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించిన ముఫ్తీ, "వేర్పాటు వాదులకు, రాళ్లు విసురుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు నాదొక్కటే విన్నపం. శాంతిని నెలకొల్పేందుకు సహకరించండి. పౌరుల మరణాలను నేను ఖండిస్తున్నా" అని అన్నారు. పోలీసుల కాల్పులపై విచారణ జరిపిస్తామని ఆమె హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ ప్రతినిధి నయీమ్ అఖ్తర్ వ్యాఖ్యానించారు. శ్రీనగర్ సహా కాశ్మీరు లోయలోని 10 జిల్లాల్లో కర్ఫ్యూ అమలవుతుండగా, నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పోలీసు అధికారి తన వాహనంలో వెళుతుండగా, అడ్డగించిన నిరసనకారులు ఆయన వాహనాన్ని జీలం నదిలోకి నెట్టేశారు. అనంత్ నాగ్ జిల్లా సంగం వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో పోలీసు అధికారి మృతి చెందారని తెలుస్తోంది. గత వారం చివరి నుంచి జరుగుతున్న అల్లర్లలో 300 మందికి పైగా గాయాల పాలవగా, అందులో భద్రతా దళాలకు చెందిన 90 మంది ఉన్నారని అధికారులు వివరించారు. మొత్తం 40 ప్రభుత్వ కార్యాలయాలకు, నాలుగు పోలీసు స్టేషన్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారని తెలిపారు. కాగా, నాలుగు రోజులుగా నిలిచిన అమర్ నాథ్ యాత్రను పాక్షికంగా తిరిగి ప్రారంభించామని, జమ్మూలోని బేస్ క్యాంపుల్లో ఆగిపోయిన 15 వేల మందిని దశలవారీగా పంపుతామని పేర్కొన్నారు.