: వెలుగులోకి కొత్త కుంభకోణం... తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 లక్షలిస్తే ఓసీలను బీసీలుగా మారుస్తున్న ముఠా
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మహా మాయగాళ్ల బండారం బట్టబయలైంది. పాతిక లక్షలు తీసుకుని ఓసీలను బీసీలుగా మార్చి చూపిస్తూ, వారికి వైద్య సీట్లను ఇప్పిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న మోసగాళ్లు ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్ కు అడ్డంగా దొరికిపోయారు. ముఠా సభ్యుడు శ్రీనివాసరెడ్డి తాను గతంలో ఎవరెవరికి దొంగ కుల ధ్రువీకరణ పత్రాలను ఇప్పించిందీ పూస గుచ్చినట్టు వివిరించాడు. వారి పిల్లలు ఎక్కడెక్కడ చదువుకుంటున్నారో చెప్పాడు. ఈ విషయాలన్నీ నేటి ఉదయం నుంచి టీవీ చానల్ లో వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం మొదలైంది. గత సంవత్సరం ఆరేడుగురికి ఇలాగే మెడికల్ సీట్లు ఇప్పించామని, ఈ సంవత్సరం 12 మందిని చేర్చనున్నామని చెప్పాడు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసినందున త్వరపడాలని తెలిపాడు. అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే, ముందుగా అర్ధ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, పని అంతా అయిపోయిన తరువాత మాత్రం డబ్బిస్తే చాలని నొక్కి మరీ చెబుతున్నాడు శ్రీనివాసరెడ్డి. విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తండ్రితో శ్రీనివాసరెడ్డి మాట్లాడటం, ఆపై హైదరాబాద్, బేగంపేటకు వచ్చి ఆయన్ను కలిసి చర్చించడం, బతిమిలాడగా బేరాన్ని రూ. 21 లక్షలకు సెట్ చేయడం వంటివి ఈ స్టింగ్ ఆపరేషన్ లో వీడియోకు చిక్కాయి. ఈ దందాకు బీసీ సంక్షేమ శాఖల్లోని ఉద్యోగులతో పాటు రెవెన్యూ, వర్శిటీ ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని, వారందరికీ తాను ముడుపులు ఇవ్వాల్సి ఉన్నందున డబ్బులు ఎక్కువగా తగ్గించలేనని శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడు. ఈ మొత్తం దందాపై తెలుగు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.