: భయపెడుతున్న డబ్ల్యూహెచ్ఓ నివేదిక.. వాతావరణ మార్పులకు లక్షల్లో బలయ్యే అవకాశం ఉందని హెచ్చరిక
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా నివేదిక భారత్‌ను భయపెడుతోంది. వాతావరణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా 2030 నాటికి ఏడాదికి 2.5లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేసింది. వీటిలో చాలా వరకు మరణాలు మలేరియా, డయేరియా, వేడి, పోషకాహార లోపం కారణంగానే సంభవిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఇండియాను ఇప్పటికే ఈ జబ్బులు కుదిపేస్తున్నాయని తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ పరిశోధన కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి దేశంలో ఏడాదికి 1.30లక్షల మంది మరణించే అవకాశం ఉందని తెలిపింది. చిన్నారులు, మహిళలు, పెద్దలపై పైన పేర్కొన్న వ్యాధులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. కాగా తాజా వివరాలను ప్రపంచ దేశాలకు పంపిస్తూ డబ్ల్యూహెచ్ఓ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ మార్పులతో సంబంధముండే ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలని కోరింది. ముఖ్యంగా భారత్ ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.