: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెలంగాణ భవన్ అధికారి!: అమర్ నాథ్ యాత్రికుల బంధువుల ఆరోపణ


శ్రీనగర్ లో కర్ఫ్యూ కొనసాగుతున్న కారణంగా అమర్ నాథ్ యాత్రను నిలిపివేయడంతో బల్తాల్ లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారు, ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన యాత్రికులు, శివ భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ ఇబ్బంది పడుతున్న భక్తులను ఆదుకునేందుకుగాను మెదక్ జిల్లా సిద్దిపేట శివభక్త సమాజం వారు అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి తరపున సుమారు 5,000 మంది భక్తులకు భోజన సదుపాయాలను, ఇతర వసతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమర్ నాథ్ అన్నదాన సేవా సమితికి చెందిన భూపతి మాట్లాడుతూ, అధికారుల నుంచి తమకు ఎటువంటి సాయం అందడం లేదని అన్నారు. ప్రభుత్వాధికారులు ఏమాత్రం స్పందించడం లేదని చెప్పారు. గ్యాస్, కూరగాయల కొరత బాగా ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ గోడు విన్నవించుకున్నామన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు చెప్పామని, ఢిల్లీ కమిషనర్ తో మాట్లాడి చెబుతానన్నారన్నారు. అదే విధంగా తెలంగాణ మంత్రి హరీష్ రావుకు చెప్పామని... ఇప్పటి వరకు ఏమాత్రం పురోగతి లేదని చెప్పారు. ఇక, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ జాడ లేదని, వరుసగా నాలుగు రోజుల సెలవుల కారణంగా కార్యాలయాన్ని మూసివేశారని యాత్రికుల బంధువులు విమర్శిస్తున్నారు. అమర్ నాథ్ యాత్రికుల విషయమై ఫోన్ చేసిన వారికి సెలవుల తర్వాత సంప్రదించాలని ఆయన నిర్లక్ష్యంగా చెబుతున్నారని వారు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News