: మాల్యాకు ఝలక్: సెప్టెంబరు 9లోపు హాజరు కావాల్సిందేనన్న కోర్టు
బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయి కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఢిల్లీ కోర్టు ఝలక్కిచ్చింది. 'ఫెరా' (ఫారిన్ ఎక్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్) ఉల్లంఘన కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపును రద్దు చేసింది. సెప్టెంబరు 9వ తేదీ లోపు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి సుమిత్ దాస్ ఆదేశించారు. లండన్లో జరిగిన ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో కింగ్ఫిషర్ లోగోను ప్రదర్శించేందుకు మాల్యా రూ.2 లక్షల డాలర్లను బ్రిటిష్ సంస్థకు ఇచ్చినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపించింది. ఈ మొత్తం లావాదేవీ ఆర్బీఐ అనుమతి లేకుండానే జరిగిందని, ఇది ఫెరా ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ 2000 సంవత్సరంలో సమన్లు జారీ చేసింది. కేసు విచారణ సందర్భంగా మాల్యాకు కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ తుది దశలో ఉండడంతో అతని హాజరు తప్పనిసరి అని భావించిన ఈడీ మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోర్టును కోరింది. ప్రస్తుతం మాల్యా బ్రిటన్లో ఉన్నారని, ఆయన హాజరు కీలకమని పేర్కొంది. వాదనలు విన్న కోర్టు మాల్యా వ్యక్తిగత హాజరు మినహాయింపును రద్దు చేసింది. సెప్టెంబరు 9వ తేదీలోపు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.