: ఉగ్రవాది బుర్హాన్ వానీ జాడ చెప్పింది అతని ప్రియురాలే!
కాశ్మీర్ పోలీసులు మట్టుబెట్టిన ఉగ్రవాది బుర్హాన్ వానీ జాడను గురించిన సమాచారాన్ని అందించింది ఆయన ప్రియురాలేనని తెలుస్తోంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ పోస్టర్ బాయ్ గా, యువత మనసులో ఉగ్రవాద బీజాలను నాటడంలో సిద్ధహస్తుడిగా ఉన్న బుర్హాన్ ను శుక్రవారం నాడు ఎన్ కౌంటర్ చేయగా, ఆపై జమ్మూ కాశ్మీర్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తన తలపై రూ. 10 లక్షల రివార్డున్న బుర్హాన్ కు ఎంతో మంది యువతులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని సమాచారం. తనతో ఉంటూ, మరింత మంది వద్దకు బుర్హాన్ వెళుతున్నాడన్న కోపంతో, ఓ యువతి అతనికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆమె భావించి, సెక్యూరిటీ అధికారులకు బుర్హాన్ కదలికలపై సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. బుర్హాన్ అనంతనాగ్ జిల్లాలో ఉన్నాడని చెబుతూ, ఆయనున్న ప్రదేశం గురించి కచ్చితమైన సమాచారాన్ని ఆ యువతి ఇవ్వడంతోనే ఎన్ కౌంటర్ సులభమైందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.