: లక్ష కోట్లు దోచుకున్న జగన్ మాటల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు: ఆనం వివేకా తీవ్ర విమర్శలు
వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ని మహాపాపి అని అన్నారు. ఆయన ఏపీని దోచేశారని, దాంతో ఏపీ పేద రాష్ట్రంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మొదలుపెట్టిన ‘గడప గడపకు వైసీపీ’ కార్యక్రమంపై ఆయన మండిపడ్డారు. ఆ కార్యక్రమాన్ని ఓ ప్రహసనం అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ నేతలు ప్రజలకి ఏం చెప్పనున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ విషయాల్ని వైసీపీ నేతలు ముందుగా మీడియాకి చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా బ్యాలెట్ అని హంగామా చేసి ఏపీ సీఎంకి జీరో మార్కులు అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆనం వివేకా మండిపడ్డారు. మార్కులు వేయడానికి వైసీపీ నేతలెవరు..? అని ఆయన ప్రశ్నించారు. దివంగత వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని, అటువంటి నేత మాటలని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ మాటలు నమ్మడానికి తెలుగు ప్రజలు పిచ్చోళ్లేం కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో జగన్ గమనించాలని ఆనం వివేకా సూచించారు. చంద్రబాబు సీఎం సీటు ఎప్పుడు దిగుతారా..? అని మాత్రమే వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారని, వారికి రాష్ట్రాభివృద్ధి ఏ మాత్రం పట్టదని వివేకా విమర్శించారు. ‘చంద్రబాబుని సీటు నుంచి దించాలనుకుంటే ఆయనని ఆ సీటుపై కూర్చోబెట్టిన వాళ్లకే సాధ్యం.. అంతేకానీ.. సీఎంను తన సీటు నుంచి దిగమనడానికి జగన్ ఎవరు..?’ అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ని మాత్రం ప్రతిపక్ష నాయకుడి హోదా నుంచి ప్రజలు దించేసే రోజులు దగ్గర పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు.