: ఒక్క నిమిషం ఆలస్యమైంది.. గేటులో నుంచి దూరి పరీక్ష హాలుకు దూసుకెళ్లిన విద్యార్థులు!
తెలంగాణలో ఈరోజు నిర్వహించతలపెట్టిన ఎంసెట్-2 పరీక్ష ప్రారంభమైంది. అయితే పరీక్షకు హాజరుకావడానికి కొందరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో హైదరాబాద్‌లోని పలు పరీక్ష సెంటర్లలో గందరగోళ పరిస్థితి కనిపించింది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఓ సెంటర్లో కొందరు విద్యార్థులు పరీక్షకు ఒక్క నిమిషం లేటుగా వచ్చిన పరిస్థితి కనిపించింది. సరిగ్గా సమయం కావడంతో పరీక్ష నిర్వహిస్తోన్న కాలేజీ యాజమాన్యం గేటుకి తాళం వేసింది. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న పలువురు విద్యార్థులు ఆ గేటులోంచి దూరి లోపలికి పరుగులు తీశారు. ఈ దృశ్యాలను గమనించిన యాజమాన్యం గేటు కదలకుండా దానికి రెండు, మూడు తాళాలు వేశారు. దీంతో గేటులో దూరే అవకాశం లేకుండా పోయిన పలువురు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యాజమాన్యాన్ని బతిమిలాడే ప్రయత్నాలు చేశారు. నిబంధనలు వర్తించవని అక్కడి సిబ్బంది చెప్పడంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వారితో వాగ్వివాదానికి దిగారు. ట్రాఫిక్ జామ్ అయిందంటూ పలు కారణాలు చెప్పడానికి ప్రయత్నించారు. దానికి కాలేజీ యాజమాన్యం ‘అన్ని కష్టాలున్నాయని మాకూ తెలుసు.. పరీక్ష జరుగుతుందని తెలుసు కదా.. సమయానికి ముందే సెంటర్‌కు చేరుకోవాలి’ అని సమాధానమిచ్చారు. దీంతో విద్యార్థులు కన్నీరు పెట్టుకొని వెనుదిరిగారు. మరోవైపు ఈరోజు కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ వద్ద కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. విద్యార్థుల హాల్‌టిక్కెట్ నంబర్లు, రూమ్ నంబర్లను సూచిస్తూ పెట్టే నోటీస్ బోర్డు అర్థం కాకుండా ఉందని, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మీడియాతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డులు సరిగ్గా పెట్టలేదని వాపోయారు.