: తరగతి గదిలో సెల్‌ఫోన్ వాడితే రూ.10వేల జరిమానా... చెన్నై అన్నా యూనివర్సిటీ నిర్ణయం


తరగతి గదుల్లో సెల్‌ఫోన్లు వినియోగించే వారి నుంచి పదివేల రూపాయల జరిమానా వసూలు చేయనున్నట్టు చెన్నైలోని అన్నా యూనివర్సిటీ విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. గతంలోనూ ఓసారి ఇటువంటి హెచ్చరికలే చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తాజాగా విద్యార్థులను హెచ్చరిస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. యూనివర్సిటీలోని గిండి ఇంజినీరింగ్ కళాశాలలోని క్లాస్ రూములు, ల్యాబ్, ఆఫీసులలో ఎక్కడైనా సెల్‌ వాడుతూ కనిపిస్తే రూ.10 వేల జరిమానా విధించడంతోపాటు ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అయితే, తీసుకున్న ఫోన్లను కోర్సు పూర్తయిన తర్వాత ఇచ్చేస్తామన్నారు. చదువుపై విద్యార్థులు మరింతగా దృష్టి నిలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ నిబంధన కచ్చితంగా అమలవుతున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 2005లో అధికారులు ఇటువంటి నిబంధనను ప్రవేశపెట్టినా అప్పట్లో విద్యార్థులు సహా వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో తరగతి గదుల్లో కాకుండా బయట మాట్లాడుకోవచ్చంటూ కొంత సడలింపు ఇచ్చారు. ఇది కాస్తా శ్రుతి మించడంతో తాజాగా మరో సర్క్యులర్ జారీ చేశారు. ఇక నుంచి సెల్‌ఫోన్ వాడుతూ కనిపించే విద్యార్థుల ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకోవడమే కాకుండా రూ.10 వేల జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. ఈ హెచ్చరిక విద్యార్థులపై ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News