: నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే!
నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వివిధ పనుల వల్ల నిద్రపోయేందుకు సమయం సరిపోవడం లేదని కొందరు, బాగా నిద్రపోయి అధిక విశ్రాంతి తీసుకుంటున్నాం కదా అని మరికొందరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అయితే అది తప్పని, ఇలాంటి చర్యల వల్ల శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. దాదాపు 50 వేల మందిపై పరిశోధన చేసిన వైద్య బృందం... నిద్రలేమి, అతినిద్ర వల్ల రక్తంలో సి-రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకేన్-6లు పెరిగిపోయి రక్తపోటు, టైప్-2 డయాబెటీస్ తో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చిరాకు, కోపం, అసహనం, తీవ్ర భావోద్వేగాలు కలగడం, కోరికలు పెరగడం జరుగుతుందని సూచిస్తున్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే నిద్రా సమయంలో మార్పులు అవసరమని అన్నారు. ప్రతి మనిషికి సగటున 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వారు స్పష్టం చేశారు.