: పరువు హత్య కేసు కీలక మలుపు... తల్లి వ్యాఖ్యలే వాస్తవం... లవర్ దీపక్ అరెస్టు!
కృష్ణా జిల్లాలోని విజయవాడలో చోటుచేసుకున్న పరువు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. హిందూ మతానికి చెందిన తనను ప్రేమించిందన్న కారణంతో కన్న కూతుర్ని బీబీజాన్ అనే మహిళ హత్య చేసిందని ఆరోపిస్తూ దీపక్ అనే యువకుడు నున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీబీజాన్ మాట్లాడుతూ, దీపక్ కారణంగానే తన కుమార్తెను హత్య చేయాల్సి వచ్చిందని, అతని లైంగిక వేధింపులు తాళలేక అసహనంతో తన కుమార్తెను తానే హత్య చేశానని పేర్కొంది. ఈ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హతురాలు నజ్మా తండ్రి ఫిర్యాదుతో దీపక్ పై కేసు నమోదు చేశారు. అనంతరం అతని కాల్ లిస్టు, అతని మొబైల్ డేటాను పరిశీలించారు. దీంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. నజ్మాను లైంగికంగా దీపక్ వేధించాడని నిర్థారించారు. నజ్మాతో దిగిన నగ్న చిత్రాలను ఆమె తల్లికి చూపించి వేధింపులకు దిగాడని, అతని వేధింపులు తాళలేని బీబీజాన్ కన్న కుమార్తెను హత్య చేయాల్సి వచ్చిందని గుర్తించారు. దీంతో దీపక్ ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కాగా, ఈ హత్య కేసు నిందితురాలు బీబీజాన్ పరారీలో వుందని పోలీసులు తెలిపారు.