: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
విజయవాడలో సుదీర్ఘంగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా కేబినెట్‌లో తీసుకొన్న నిర్ణయాలను మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాకు వివరించారు. పట్టిసీమ పూర్తి చేయడం కోసం కృషి చేసిన ఇంజినీర్లకు నెలరోజుల ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పారు. బందరు పోర్టు నిర్మాణంలో భూసమీకరణ విధానాన్నే వర్తిపంజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థకు ఆమోదం తెలిపామన్నారు. స్థానికత అంశంలో వీలైనంత త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు వివిధ జిల్లాల్లో భూ కేటాయింపులు చేస్తూ తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో చిన్న పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. దీని కోసం పరిశ్రమల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 110 నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో 100 కన్నా ఎక్కువ స్థలాలను గుర్తించామని ఆయన చెప్పారు. మొత్తం 18,341 ఎకరాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆ స్థలాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి చిన్న పారిశ్రామికవేత్తలకు ఆ స్థలాలను ఇస్తామని ఆయన చెప్పారు. చిన్న పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పల్లెరఘునాథ్ రెడ్డి తెలిపారు. దీని ప్రకారం అమిటీ, ఎస్ఆర్ఎం, విట్, సెంచూరియన్ వర్సిటీలను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచాలని నిర్ణయం తీసుకున్నట్లు పల్లెరఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.