: జాతి వివక్షపై ఒబామా సంచలన వ్యాఖ్యలు... నల్లజాతీయులే ఎక్కువగా బాధితులవుతున్నారని కామెంట్!
జాతి వివక్షపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మిన్నెసోటాలో చోటుచేసుకున్న కాల్పుల వివాదం రగులుకుంటోంది. నల్లజాతీయుల ఆందోళనలతో అమెరికా ప్రధాన పట్టణాలు అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒబామా చేసిన వ్యాఖ్యలు వాటిని మరింత రెచ్చగొట్టేలా ఉండడం విశేషం. నాటో సమావేశాల కోసం పోలెండ్ లోని వార్సాకు చేరుకున్న ఆయన మాట్లాడుతూ, నల్లజాతీయులపై కాల్పులు జాతి వివక్ష కారణంగా చేసినట్టు కనబడుతున్నాయని అన్నారు. ఇలాంటి క్రూరమైన ఘటనల వల్ల అమెరికన్లంతా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే అమెరికా క్రిమినల్ జస్టిస్ సిస్టం చూపుతున్న గణాంకాల్లో నల్ల జాతీయులే అన్యాయానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లజాతీయులతో పోలిస్తే 30 శాతానికి పైగా నల్లజాతీయులను పోలీసులు వివిధ కారణాలతో అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలా అడ్డుకున్న తరువాత వారిని మూడు అంతకంటే ఎక్కువసార్లు పరిశీలిస్తున్నారని ఆయన విమర్శించారు. గడచిన ఏడాది కాలంలో తెల్లజాతీయులతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ మంది నల్లజాతీయులను అమెరికా పోలీసులు కాల్చారని ఆయన వెల్లడించారు. అలాగే రెండు రెట్లు అధికంగా నల్లజాతీయులను అరెస్టు చేశారని ఆయన తెలిపారు. సరైన పత్రాలున్నప్పటికీ 75 శాతం కంటే ఎక్కువ కేసులు నల్లజాతీయులపై మోపబడ్డాయని ఆయన పేర్కొన్నారు. వీరిలో 10 శాతం మందికి శిక్షలు కూడా పడ్డాయని ఆయన చెప్పారు. అవే ఆరోపణలు ఎదుర్కొన్న తెల్లజాతీయులను ఎలాంటి శిక్షలు లేకుండా వదిలేశారంటూ ఆరోపించారు. కేవలం చర్మం రంగు కారణంగా వివక్ష చూపడం సరికాదని, ఇలాంటి చర్యల వల్ల ఇబ్బందులు పడేది నల్లజాతీయులు కాదని, దేశం మొత్తం ఈ సమస్యను ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు.