: బందరు వాసులకూ అమరావతి తరహా పరిహారం: చంద్రబాబు మంత్రిమండలి కీలక నిర్ణయాలు
బందరు పోర్టు నిర్మాణంలో భూ సమీకరణ విధానాన్నే అమలు చేయాలని, రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకునే విధానానికి స్వస్తి పలకాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఈ ఉదయం నుంచి చంద్రబాబు మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో రైతుల నుంచి భూమిని సేకరించి పరిహారం ఇస్తున్న విధానాన్నే మచిలీపట్నంలో సైతం అమలు చేయాలని నిర్ణయించింది. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన వారికి అభివృద్ధి చేసిన భూమిలో వాణిజ్య, నివాస స్థలాలు కేటాయించేందుకు వీలు కల్పిస్తూ, మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థకు భూ సమీకరణ అధికారాలు కట్టబెడుతున్నట్టు ప్రకటించింది. పట్టిసీమ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు నిద్రాహారాలు మాని పనిచేసిన ఇంజనీర్లకు, అధికారులకు, నీటి పారుదల శాఖ సిబ్బందికి ఒక నెల జీతాన్ని ఇంక్రిమెంటుగా ఇవ్వాలని బాబు మంత్రిమండలి తీర్మానించింది. హైదరాబాద్ నుంచి తరలివచ్చే ప్రజల స్థానికత విషయంలో మార్గదర్శకాలను సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు వివిధ జిల్లాల్లో విద్యాసంస్థలను నెలకొల్పేందుకు భూములను కేటాయిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. మొత్తం మూడున్నర గంటలకు పైగా సాగిన సమావేశంలో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం పలికింది. రాష్ట్రంలో ప్రైవేటు వర్శిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ప్రతిపాదిత ట్రిపుల్ ఐటీలకు ఆమోదం తెలిపింది.