: చిన్నారి సానియా సంరక్షణ బాధ్యతల స్వీకరణ అంశంపై ఫ్యామిలీ కోర్టుకు వెళ్లండి: ఉప్పర్పల్లి కోర్టు ఆదేశం
ఐదు రోజుల క్రితం భర్త రూపేశ్ చేతిలో దారుణంగా హత్యకు గురయిన కాంగో దేశస్థురాలు సింథియా కుమార్తె సానియా ఎవరి సంరక్షణలో ఉండాలన్న అంశంపై సందిగ్ధత ఏర్పడింది. కాంగో నుంచి వచ్చిన సింథియా కుటుంబ సభ్యులు, మరోవైపు రూపేశ్ కుటుంబ సభ్యులు సానియాని తమకే అప్పగించాలని వేడుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై వాదనలు విన్న రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి కోర్టు న్యాయమూర్తి చిన్నారి బంధువులని ఎల్బీనగర్లోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాలని సూచించారు. సానియాను కూడా ఫ్యామిలీ కోర్టుకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు సానియా బంధువులు నడుచుకోవాలని చెప్పారు. ప్రస్తుతం చిన్నారి సానియా శిశుసంరక్షణ కేంద్రంలో ఉంటోంది. సానియాను అక్కడి నుంచి ఫ్యామిలీ కోర్టులో హాజరు పరచడానికి తరలించారు. మరోవైపు సింథియాను హత్యచేసిన రూపేశ్ను మూడు రోజులు కస్టడీకి తీసుకోవాలని మాదాపూర్ సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఈ అంశంపై ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై కోర్టు విచారించాల్సి ఉంది.