: ట్రీ మాఫియాను స్వయంగా పట్టుకున్న స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొద్దిసేపటి క్రితం చెట్లను అక్రమంగా నరికి కలప వ్యాపారం చేసుకునే మాఫియాను స్వయంగా పట్టుకున్నారు. ఈ ఉదయం గుంటూరు నుంచి నరసరావుపేటకు ఆయన బయలుదేరగా, ఫిరంగిపురం దాటిన తరువాత రహదారికి పక్కనే ఉన్న చెట్లను నరికివేస్తున్న కొందరు కనిపించారు. దీంతో తన వాహనాన్ని ఆపించి, తొలుత వారిని చెట్లను ఎవరు నరకమన్నారని ప్రశ్నించారు. భారీ వృక్షాలను ఎందుకు తొలగిస్తున్నారని ఆగ్రహించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో, ఫిరంగిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ప్రశ్నించేసరికి కలప వ్యాపారం నిమిత్తం చెట్లను నరుకుతున్నట్టు వారు తెలిపారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన కోడెల, వారికి సరైన శిక్ష పడేలా కేసు పకడ్బందీగా తయారు చేయాలని ఆదేశించారు. కేవలం మొక్కలు నాటితేనే సరిపోదని, పెరిగిన చెట్లను కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజలపై ఉందని ఈ సందర్భంగా కోడెల వ్యాఖ్యానించారు. కలప మాఫియాతో కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కైనట్టు తనకు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.