: ‘వీఐపీ ట్రీట్మెంట్’పై మండిపడిన ఎంపీ.. తననూ సామాన్యుల్లాగే చూడాలంటూ లేఖ
మామూలు నేతలకు ఇది మింగుడుపడని విషయమే. రాజకీయాల్లో చిన్న పదవి ఉంటే చాలు, ఎక్కడికెళ్లినా వీఐపీలా తనను గుర్తించాలని తహతహలాడే రాజకీయ నాయకులెందరో. అలాంటిది కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ టంకా తనను వీఐపీగా గుర్తించి విమాన సిబ్బంది సేవలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తనకిచ్చిన వీఐపీ ట్రీంట్మెంటుతో చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నట్టు ఏకంగా ప్రైవేటు విమానయాన సంస్థకు లేఖ రాశారు. ఎంపీ వివేక్ గురువారం జబల్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు స్పైస్ జెట్ విమానం ఎక్కారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాక ఆయనతోపాటు మరో పార్లమెంట్ సభ్యుడిని ట్రాన్సిట్ బస్సులోకి ఎక్కించిన విమాన సిబ్బంది తలుపులు మూసేసి ఇతర ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిరాకరించారు. ఇది ఆయనను తీవ్రంగా కలచివేసింది. వెంటనే ఎంపీ విమాన సంస్థకు లేఖ రాశారు. తాను ఎంపీని అయినంత మాత్రాన ఇటువంటి ‘మర్యాద’లు తగవని, అందరిలాగే తననూ పరిగణించాలని కోరారు. ‘‘మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం. ఇక్కడ అందరూ సమానమే. అందరికీ తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ఇతర ప్రయాణికులను ఎలా పరిగణిస్తున్నారో తననూ అలాగే చూడాలని కోరారు. ‘‘ఇటువంటి ‘ట్రీట్మెంట్’ ఇక నుంచి ఎంపీలకు ఇవ్వవద్దు (కనీసం నాకు అయినా). వీఐపీ ట్రీట్మెంట్ను గుర్తించిన వెంటనే గ్రౌండ్ సిబ్బందిని వారించా’’ అని లేఖలో పేర్కొన్నారు. ఇక నుంచి ఇటువంటి మర్యాదలు తీసిపడేయాలని సూచించారు. గతేడాది కేంద్రమంత్రి కోసం ఎయిర్ ఇండియా విమానాన్ని ఆలస్యం చేయడమే కాకుండా ప్రయాణికులను దించేసిన సంగతి తెలిసిందే. ‘వీఐపీ కల్చర్’కు ఇదో నిదర్శనంగా చెప్పుకోవచ్చు.