: హైకోర్టు విభజనపై గవర్నర్ ఆసక్తికర కామెంట్!...భగవంతుడే చూసుకుంటాడన్న వైనం!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన అంశం ఇరు రాష్ట్రాల మధ్య పెను వివాదంగా మారింది. ఈ విషయంపై ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే కేంద్రం ఆదేశాలతో సమస్య పరిష్కారం కోసం రంగంలోకి దిగిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ మొన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కోసం ఏకంగా విజయవాడ వెళ్లారు. చంద్రబాబుతో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, సమస్య పరిష్కారమవుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రానికల్లా తిరుమల చేరుకున్న ఆయన, శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన అంశం గురించి మీడియా అడిగినప్పుడు, 'దేవుడే చూసుకుంటాడంటూ' ఆయన దైవంపై భారం వేస్తూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.