: ఈనెల 11 నుంచి 17 వరకు దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతాం: ప్రకాశ్ కారత్
ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై సీపీఎం నేత ప్రకాశ్ కారత్ మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. దేశ వ్యాప్తంగా 7.45 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతుంటే మరోవైపు మోదీ ప్రభుత్వం ఆ ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఏ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలు ఎదుర్కుంటోన్న ఈ సమస్యలపై తాము దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తామని ప్రకాశ్ కారత్ చెప్పారు. ఈనెల 11 నుంచి 17 వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన వెల్లడించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలపై గళం ఎత్తుతామని ఆయన పేర్కొన్నారు.