: జెట్ ఎయిర్ వేస్ బ్రేక్ ఫాస్ట్ లో బొద్దింక... ప్రయాణికుడికి అస్వస్థత
జెట్ ఎయిర్ వేస్ విమాన ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి రాజ్ కోట్ కు బిజినెస్ క్లాసులో ప్రయాణించిన బిర్జు సల్లా అనే వ్యక్తికి ఎయిర్ వేస్ సిబ్బంది బ్రేక్ ఫాస్ట్ గా ఇచ్చిన పరోటా, చెనా మసాలాలో బొద్దింక ఉంది. చూసుకోకుండా దానిని తిన్న అతను అస్వస్థతకు గురయ్యాడు. అయితే, తనకు విమాన సిబ్బంది వైద్య సాయం అందించకపోగా, వేరే ఆహారం ఇస్తామంటూ క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారని బిర్జు వాపోయారు. ఈ సంఘటనపై ఎయిర్ వేస్ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. కాగా, తమ ప్రయాణికుడికి ఇబ్బంది కల్గినందుకు చింతిస్తున్నామంటూ సదరు ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి ప్రకటించారు.