: అనుమతులు పొందకుండానే ప్రసారమవుతున్న ముస్లిం చానల్ 'పీస్ టీవీ'... ఆపేవారెవరు?


బంగ్లాదేశ్ లో 20 మందిని బలిగొన్న ఉగ్రదాడి తరువాత ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో ముస్లిం మత ప్రచారం నిమిత్తం ఓ టీవీ చానల్ కూడా నడుస్తోంది. ఆయన ఆ చానల్ ద్వారా చేసే ప్రసంగాల పట్ల ఆకర్షితులై బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారన్న అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. వాస్తవానికి పీస్ టీవీకి ఇండియాలో ఎలాంటి లైసెన్సులూ మంజూరు చేయలేదు. దుబాయ్ నుంచి అప్ లింక్ అవుతున్న ఈ చానల్ భారత ఉపఖండంలో కేబుల్ ఆపరేటర్ల ద్వారా సులువుగానే ప్రసారం అవుతోంది. భారత సమాచార శాఖలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఈ చానల్ ప్రసారాలు సాగుతున్నాయని కనుగొన్న అధికారులు, ఇప్పుడా చానల్ కు చెక్ పెట్టే పనిలో పడ్డారు. నాయక్ చేసిన ప్రసంగాలన్నింటినీ పరిశీలించాలని, వాటిల్లో అభ్యంతర మాటలుంటే కేసులు పెట్టాలని నిర్ణయించారు. లైసెన్సులు లేని చానళ్లను ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ, అసంఘటిత రంగంగా ఉన్న కేబుల్ టీవీ విభాగంలో ఎవరు ఎప్పుడు ఏ చానల్ ప్రసారాలు ఇస్తున్నారన్నది తెలుసుకోవడం చాలా కష్టమని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక ఇదే విషయమై సమాచార, ప్రసార శాఖకు నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడిని వివరణ కోరగా, తాను కొత్తగా వచ్చానని, అన్నింటినీ పరిశీలించేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News