: చెడ్డోడు సద్దాం హుస్సేన్ ఓ విషయంలో మాత్రం ఎంతో మంచోడు: డొనాల్డ్ ట్రంప్
ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ను పదవీచ్యుతుడను చేయడమే కాకుండా, తన మద్దతుతో అక్కడ ఏర్పడిన ప్రభుత్వం ద్వారా ఆయనను ఉరి తీయించిన అమెరికాకు తదుపరి అధ్యక్షుడు కావాలని ఆశపడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. "సద్దాం హుస్సేన్ ఓ చెడ్డోడు, నిజమేగా? మీకు తెలుసా ఆయన చేసిన మంచిపని? ఆయన ఉగ్రవాదులను చంపించాడు. అది ఎంతో మంచి పని" అని నార్త్ కరోలినా ప్రాంతంలో ఓ ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ పొగిడారు. నేడు అదే ఇరాక్ ఉగ్రవాదానికి హార్వార్డ్ యూనివర్శిటీలా మారిపోయిందని, సద్దాం ఉండుంటే ఈ పరిస్థితి ఏర్పడకపోయి ఉండవచ్చని అన్నారు. తమ ప్రసంగాల్లో సద్దాంను ట్రంప్ తలచుకోవడం, ప్రస్తావించడం ఇదే తొలిసారి. ఇక ఆయన వ్యాఖ్యలపై హిల్లరీ వర్గం మండిపడుతోంది. నియంతలను, వారి పాలనా విధానాలను వెనకేసుకుని వస్తున్న ట్రంప్ గెలిస్తే, అటువంటి పాలనే కనిపిస్తుందని హిల్లరీ రాజకీయ సలహాదారు జేక్ సుల్లివాన్ వ్యాఖ్యానించారు.