: ఉగ్రవాదం ఇస్లాంకి, మానవత్వానికి వ్యతిరేకం.. ముస్లింలపై దాడి హేయమైన చర్య: షేక్ హసీనా
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని మరువకముందే అక్కడి కిషోర్‌గంజ్ ప్రాంతంలోని ఈద్గా మైదానం సమీపంలో ఈరోజు దాడికి దిగి భయానక వాతావరణం సృష్టించిన ఉగ్రవాదుల చర్యపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. రంజాన్ సందర్భంగా పవిత్రతతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తోన్న వారిపై ఉగ్రవాదులు దాడికి తెగబడడం హేయమైన చర్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు దాడులకు తెగబడడం పిరికిపంద చర్యేనని ఆమె వ్యాఖ్యానించారు. ఈద్గా మైదానం సమీపంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాదం అనేది ఇస్లాంకి, మానవత్వానికి వ్యతిరేకమని ఆమె ట్వీట్ చేశారు. ఈద్గా మైదానం సమీపంలో రెండు లక్షల మంది ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.