: 'నోరు ముయ్యకుంటే రేప్ చేస్తా': క్యాబ్ డ్రైవర్ మాటలకు బెదిరిపోయి కారు దూకేసిన యువతి!


"ఏక్ దమ్ చుప్! తోకీ కిడ్నాప్ కోరే రేప్ కోరే దేబో" (నోరు ముయ్యి! లేకుంటే నిన్ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తా) అన్న క్యాబ్ డ్రైవర్ మాటలు విని వణికిపోయిన ఓ యువతి కారులో నుంచి దూకేసిన ఘటన కోల్ కతాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, సాల్ట్ లేక్ సమీపంలోని జేడీ బ్లాక్ సమీపం నుంచి బాధితురాలు, తన స్నేహితురాలితో కలసి రాత్రి 10 గంటల సమయంలో ఓ క్యాబ్ ను బుక్ చేసుకుంది. ఆపై తన స్నేహితురాలిని ఆర్యన్ భవన్ వద్ద దిగబెట్టి, తన గమ్యస్థానానికి వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. కారు రాంగ్ రూట్ లో వెళుతున్న విషయాన్ని గమనించిన బాధితురాలు హెచ్చరించగా, కాసేపు సరైన దారిలోనే వచ్చిన క్యాబ్ డ్రైవర్ మరోసారి తప్పు దారిలోకి కారును నడిపించాడు. దీంతో ఆమె ప్రమాదాన్ని గమనించి కేకలు పెడుతుంటే, డ్రైవర్ నోటికొచ్చినట్టు దూషించడం మొదలు పెట్టాడు. కిటికీ అద్దాలు తెరచి సహాయం కోసం ఆమె అరుస్తూ, రోడ్డుపై ఎవరూ లేరని తెలుసుకుని కారులోంచి దూకేందుకు సిద్ధపడింది. ఆమె ప్రయత్నాన్ని గమనించిన డ్రైవర్, కాళ్లను బంధించేందుకు, ముందు సీటును వెనక్కు నెట్టాడు. కారు దిగాలని చూస్తే, గుద్ది చంపుతానని బెదరించాడు. దీంతో వెన్నులో వణుకుపుట్టి, ఆమె కారు నుంచి సడన్ గా కిందకు దూకింది. ఆ తరువాత కూడా కారును రివర్స్ చేసుకుని ఆమెపైకి ఎక్కించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా, ఓపిక తెచ్చుకున్న బాధితురాలు డివైడర్ ను దాటుకుని అవతలికి చేరి ప్రాణాలు కాపాడుకుంది. జరిగిన ఘటనను క్యాబ్ సంస్థ ఉబెర్ కు, విధాన్ నగర్ ఉత్తర పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, నిందితుడు సంతూ ప్రమాణిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని సస్పెండ్ చేసినట్టు ఉబెర్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News