: చంద్రబాబుతో రాత్రి చర్చలు ఫలప్రదం: గవర్నర్
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు వివాదాల పరిష్కారం కోసం రంగంలోకి దిగిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తొలి రోజే ఆశించిన మేర ఫలితాన్ని సాధించినట్లుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లిన నరసింహన్ విందు సందర్భంగా పలు అంశాలపై చర్చలు జరిపినట్లు వార్తలు వినిపించాయి. వీటిని ధ్రువీకరించిన గవర్నర్... రాత్రి జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు వివాదాలు, వాటి పరిష్కారం కోసం పలు సూచనలను చంద్రబాబు ప్రస్తావించారని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ చర్చలు మరింత ఫలప్రదం కానున్నాయని, ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు తొలగిపోనున్నాయని ఆయన పేర్కొన్నారు.