: అంతా చస్తారు!... స్వర్గంలో కలుస్తారు!: ఢాకా మారణకాండకు ముందు బందీలతో ముష్కరులు!
బంగ్లాదేశ్ ఉగ్రవాద దాడులతో భీతిల్లిపోతోంది. మొన్నటి హోలీ ఆర్టిసాన్ బేకరిలో జరిగిన ఉగ్రవాద దాడి షాక్ నుంచి ఇంకా ఆ దేశ ప్రజలు తేరుకోలేదు. వారం తిరక్కముందే కొద్దిసేపటి క్రితం ఆ దేశంపై మరోమారు ఉగ్రదాడి జరిగింది. పోలీసులే లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి ఈద్ ఉల్ ఫితర్ ప్రార్ధనలు జరుగుతున్న చోట చోటుచేసుకోవడం గమనార్హం. ఇక మొన్నటి హోలీ ఆర్టిసాన్ బేకరి దాడికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగుచూసింది. దాదాపు 12 గంటల పాటు బేకరిలో నానా బీభత్సం చేసిన ఉగ్రవాదులు అందులోకి ప్రవేశించిన వెంటనే విదేశీయులుగా గుర్తించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత బేకరిలో నిర్జీవంగా పడి ఉన్న వారిని గ్యాస్ తో కాల్చేసేందుకు యత్నించారు. ఆ తర్వాత ముస్లింలుగా భావించిన వారిని ఓ టాయిలెట్ లో బంధించిన ఉగ్రవాదులు శవాల మధ్యే కుర్చీలేసుకుని కూర్చున్నారట. ఈ సందర్భంగా వారు టాయిలెట్ లోని బందీలతో మాట్లాడుతూ ‘అందరూ చస్తారు. తిరిగి స్వర్గంలో కలుస్తారు’ అని వ్యాఖ్యానించారట. బేకరిలో పనిచేసే ముస్లిం కార్మికుల మధ్య అక్కడే పనిచేస్తున్న ఓ హిందూ కార్మికుడు తాను కూడా ముస్లింనేనని చెప్పుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. తాజాగా ఆ హిందూ కార్మికుడు ఈ విషయాలను మీడియాకు వెల్లడించాడు.