: బెజవాడలో పరువు హత్య!... కూతురిని హత్య చేసిన భార్యకు భర్త మద్దతు!
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో మొన్న రాత్రి (మంగళవారం రాత్రి) ఘోరం జరిగిపోయింది. వేరే మతస్థుడిని ప్రేమించిందన్న సాకుతో కన్న కూతురిని ఓ మహిళ హత్య చేసింది. భార్య చేసిన నేరాన్ని తప్పుబట్టాల్సిన ఆమె భర్త... అందుకు విరుద్ధంగా భార్యకే మద్దతు పలికాడు. వివరాల్లోకెళితే... విజయవాడలోని బీబీ జాన్ అనే మహిళ మొన్న రాత్రి నిద్రపోతున్న తన కూతురు నజ్మా ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. తెల్లవారగానే విషయం బయటకు పొక్కకముందే కడుపు నొప్పితో తన కూతురు చనిపోయిందని చెప్పింది. అయితే నజ్మాను ప్రేమించిన యువకుడు దీపక్ కు అనుమానం వచ్చి, ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రంగప్రవేశం చేయగానే బీబీ జాన్ తన నిజ స్వరూపాన్ని నిర్భయంగా బయట పెట్టుకుంది. తాను వారించినా వినకుండా తన కూతురు ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని, తనకు కూతురు కంటే పరువే ముఖ్యమని బీబీ జాన్ చెప్పింది. కుటుంబ పరువు తీస్తున్న కూతురును తానే హత్య చేశానని నిర్భయంగా నేరాన్ని ఒప్పుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన బీబీ జాన్ భర్త మైసూర్ ఖాన్ లో కూడా కూతురు చనిపోయిందన్న బాధ ఏ కోశానా కనిపించలేదు. భార్య వాదనకే మద్దతు పలికిన అతడు తనకు కూడా కూతురు కంటే పరువే ముఖ్యమని చెప్పాడు. కూతురు విషయంలో తన భార్య చేసిన పని తనకు తప్పుగా కనిపించడం లేదని అతడు చెప్పాడు. ఈ ఘటన బెజవాడలో కలకలం రేపుతోంది.