: నరసింహన్ కు షడ్రుచులతో విందు ఇచ్చిన చంద్రబాబు!


తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం నిమిత్తం ప్రొటోకాల్ ను పక్కనబెట్టి ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో అడుగుపెట్టిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు మరుపురాని ఆతిథ్యం లభించింది. నిన్న సాయంత్రానికే విజయవాడ చేరుకున్న నరసింహన్ కు అధికారులు అక్కడి తాజ్ గేట్ వే హోటల్ లో బస ఏర్పాటు చేశారు. గవర్నర్ కు అప్పటికే షడ్రుచులతో విందుకు ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... స్వయంగా తాజ్ గేట్ వే హోటల్ కు వెళ్లి గవర్నర్ ను తన కారులో కూర్చోబెట్టుకుని తాను నివాసముంటున్న లింగమనేని హౌస్ కు తీసుకెళ్లారు. కారులో వెళుతూనే పలు విషయాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఆ తర్వాత లింగమనేని హౌస్ కు చేరుకున్న తర్వాత గవర్నర్ ను చంద్రబాబు... అక్కడ ఉన్న ఓ అద్దాల గదిలోకి తీసుకెళ్లారు. సదరు గదిలో కూర్చుంటే... అద్దాల్లోంచి కృష్ణా నది పరవళ్లతో పాటు విద్యుద్దీపాల వెలుగులోని విజయవాడను చూసే అవకాశం ఉంది. కనువిందైన దృశ్యాలను చూపిస్తూ చంద్రబాబు గవర్నర్ కు షడ్రుచులతో కూడిన విందు ఇచ్చారు. విందులో వారిద్దరు మాత్రమే పాల్గొన్నారు. విందు సందర్భంగానే వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఇక విందు ముగిసిన తర్వాత కారు వద్దకు వచ్చి మరీ గవర్నర్ ను చంద్రబాబు సాగనంపారు. ఈ సందర్భంగా గవర్నర్ కు చంద్రబాబు ఓ పెద్ద స్వీట్ బాక్సును కూడా అందజేశారు.

  • Loading...

More Telugu News