: జానారెడ్డికి సంబంధించిన జానెడు జాగా కూడా ఏ ప్రాజెక్టులోనూ పోలేదు: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి సంబంధించిన జానెడు జాగా కూడా ఏ ప్రాజెక్టులోనూ పోలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమది కూడా భూ నిర్వాసితుల కుటుంబమేనని, నిర్వాసితులకు ఉండే బాధ జానారెడ్డికి తెలియకనే 123 జీవో అంటూ, పరిహారాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. హైకోర్టు విభజన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. హైకోర్టు విభజన జరిగే వరకూ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తామని, తెలంగాణ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్, టీడీపీల రాజకీయ పునాదులు కదులుతాయనే భయంతో ఆ పార్టీల నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు.