: పుష్కరాల నేపథ్యంలో విజయవాడ స్కూళ్లకు ఆగస్టు 8 నుంచి 25 వరకు సెలవులు: జిల్లా కలెక్టర్
కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పుష్కర ఏర్పాట్లు, సిబ్బంది బస, భోజన వసతి తదితరాలపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.బాబు సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయనున్న పుష్కరఘాట్ల వద్ద సిబ్బంది ప్రత్యేక డ్రెస్ కోడ్ తో సేవలందిస్తారని తెలిపారు. ఇందుకోసం సుమారు 60 వేల మంది ఉద్యోగులు సేవలందించనున్నారని ఆయన చెప్పారు. వారందరికీ పుష్కర ఘాట్ల వద్ద బస ఏర్పాటు చేయనున్నామని అన్నారు. వారికి భోజన వసతిని 'అక్షయపాత్ర' వారి సహకారంతో ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. అలాగే కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఆగస్టు 8 నుంచి 25 వరకు సెలవులివ్వనున్నట్టు తెలిపారు.