: ఎంపీగారి కోసం చైనులాగి రైలును నిలిపేసిన అన్నాడీఎంకే కార్యకర్తలు
తమ ఎంపీ కోసం ఓ ఎక్స్‌ప్రెస్ రైలు చైనులాగి దాన్ని పార్టీ కార్యకర్తలు కాసేపు ఆపేసిన ఘటన తమిళనాడులోని తిరునల్వేలి రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. దీంతో కదులుతోన్న రైలు ఆగిపోయి, పదినిమిషాలు అక్కడే రైల్వేస్టేషన్లోనే నిలిచిపోయింది. రైలుని ఆపేయడం పట్ల ప్రయాణికులు మండిపడ్డారు. తిరునల్వేలి రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి 7.20 గంటలకు చెన్నైకి వెళ్లాల్సిన నెల్లై ఎక్స్‌ప్రెస్ అక్కడినుంచి కదిలింది. ఆ రాష్ట్ర అధికార పార్టీ అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యానంద్ ఆ రైలు ఎక్కాల్సి ఉంది. ఆమె సరైన సమయానికి రైల్వేస్టేషన్‌కి చేరుకోలేకపోయారు. సరిగ్గా రైలు బయలుదేరే సమయానికి ఆమె రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు. దూరం నుంచి ఎంపీగారి రాకను గమనించిన పార్టీ కార్యకర్తలు రైలు వెళ్లిపోకుండా చేయాలని రైలు బోగిలోకి ఎక్కి చైను లాగారు. దీంతో రైలు ఆగిపోయింది. చివరికి ఎంపీ రైలు ఎక్కారు.